ఏపీలో బ‌య‌ట‌పడుతున్న అవినీతి అన‌కొండ‌లు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రాన్ని ఎంత‌గా అవినీతి ర‌హితం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. అంత‌గా అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. ఈ ఏడాది ఏపీలో బ‌య‌ట‌ప‌డినంత‌గా న‌ల్ల‌ధ‌నం ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌లేద‌న్న‌ది వాస్త‌వం. అవినీతి పాల్ప‌డిన ఉద్యోగి.. సాధార‌ణ దొంగ‌క‌న్నా దారుణ‌మైన వ్య‌క్తి అంటూ.. ఓ సంద‌ర్భంలో నెహ్రూ పేర్కొన్నారు. సాధార‌ణ దొంగ ఒక‌రిద్ద‌రిని దోచుకుంటే.. ఈ అవినీతికి అల‌వాడుప‌డిన వైట్‌కాల‌ర్ దొంగ‌లు స‌మాజాన్నే దోచేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

నిన్న గాక మొన్న ఇద్ద‌రు భార్య‌ల ముద్దుల మొగుడు 50 కోట్ల‌కు పైగా దోచేసి దాచేసిన స‌బ్ రిజిస్ట్రార్ వెంక‌య్య‌నాయుడు ఉదంతాన్ని మ‌రువ‌క ముందే అంత‌క‌న్నా జ‌గ‌త్ జంత్రీ కిలాడీ ఒక‌డు ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు. ఉన్న‌త చ‌దువు చ‌దివి. ఉన్న‌త ఉద్యోగం వెల‌గ‌బెడుతూ.. స‌మాజాన్ని ప‌ట్ట‌ప‌గ‌లే దోచుకుతిన్నాడు. ప‌క్కా ప్లాన్‌తో త‌న‌ను ఏసీబీ కానీ మ‌రెవ‌రైనా ప‌ట్టుకున్నా.. ఎలాంటి ఆధారాలూ ల‌భించ‌కుండా ఉండేలా ప‌క్కాగా వ్య‌వ‌హ‌రించిన స‌ద‌రు ఉన్న‌తోద్యోగి.. దోచేసేంది అక్ష‌రాలా వంద‌ల కోట్లే..! అంతేకాదు, ఏసీబీ చ‌రిత్రలో ఇంత‌టి భారీస్థాయి అవినీతి రాజాను అరెస్టు చేయ‌డం ఇదే తొలిసారి. 

 ఓ చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారి ఎంత అవినీతి చేస్తే అంత సంపాదించాలి?  ఏపీ ప్రజారోగ్య శాఖలో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)గా పనిచేస్తున్న పాము పాండు రంగారావు అనే ఉన్నతాధికారికి అక్రమ సంపాదన ఏకంగా రూ.500 కోట్ల పైనే ఉండటంతో అవాక్కు అవటం ఏసీబీ అధికారుల వంతు అయింది. మిత్రుడితో కలిసి విశాఖపట్నంలో రూ.100 కోట్ల విలువైన కార్పొరేట్‌ ఆసుపత్రి నిర్మిస్తున్నాడంటే అతడి అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  అతడి మిత్రుడిని కూడా అధికారులు అరెస్టు చేశారు.  

మ‌రి రాష్ట్రాన్ని అవినీతి రహితం చేసేందుకు సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే కైజాలా యాప్ అని 1100 ఫోన్ నెంబ‌ర్ అని ఇలా అనేక విధానాలు ప్ర‌వేశ పెట్టారు. నువ్వు అవినీతికి పాల్ప‌డ‌క పోవ‌చ్చు.. కానీ.. అవినీతి నీ ఎదురుగుండా జ‌రుగుతున్న‌ప్పుడు అడ్డుకోక‌పోవ‌డం కూడా త‌ప్పేన‌న్న‌ది భార‌త రాజ్యాంగ సూత్రం. మ‌రి  బాబు ఇప్పుడు ఏం చెబుతారో చూడాలి!!